పెద్దపల్లి, మే -27 (జనం గొంతు) :
రాష్ట్ర స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలలో జిల్లా నుండి పాల్గొనేందుకు క్రీడాకారులు బయలుదేరి వెళ్లారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణం నుంచి 159 క్రీడాకారులు, 23 మంది కోచ్ లు, లైజన్ అధికారులు మొత్తం 187 మందిచే హైదరాబాద్ కు బయలు దేరిన బస్సులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 28 నుండి మే 31 వరకు హైదరాబాద్ లోని ఎల్.బి. స్టేడియం, గచ్చి బౌలి, సరూర్ నగర్, జింఖానా గ్రౌండ్, కె.వి.బి.ఆర్. యూసుఫ్ గూడా స్టేడియం లలో రాష్ట్ర స్థాయిలో సి.ఎం. కప్ క్రీడా పోటీలు జరుగనున్నాయి అని, జిల్లా స్థాయిలో విజేతలైన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపినట్లు తెలిపారు. క్రీడాకారు లతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా స్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీలలో ప్రదర్శించిన క్రీడా స్ఫూర్తిని కొనసాగిస్తూ, రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా ప్రతిభ కనబరిచి రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి వై. తిరుపతి రావు, జిల్లా విద్యా శాఖ అధికారి డి. మాధవి, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ప్రవీణ్ రెడ్డి, కోచ్ లు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.