జనం గొంతు //ఓదెల సతీష్// కుమార్
*పర్యావరణ పరిరక్షణకై ఐక్య పోరాటాలకు పిలుపు*
ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా తెలంగాణ భూమి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రెస్ క్లబ్లో వివిధ రాజకీయ పార్టీలు మరియు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. లోక్సత్తా ఉద్యమ సంస్థ నాయకులు నోముల శ్రీనివాసరెడ్డి సంధానకర్తగా వ్యవహరించిన ఈ సమావేశంలో బిజెపి నాయకులు సుగుణాకర రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రారంభోపన్యాసంలో మార్వాడి సుదర్శన్ మాట్లాడుతూ... పర్యావరణ ఉద్యమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పతాక స్థాయిలో ఉద్యమిస్తోందని గ్రానైట్ , ఇసుక దోపిడీలకు వ్యతిరేకంగా మరియు ప్రజారోగ్యాన్ని నష్టపరిచే ఇథనాల్ ప్లాంట్ల స్థాపనకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నడుస్తున్నాయని వాటిని విజయవంతం చేయడంలో ప్రజా సంఘాలన్నీ ఏకమై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రారంభోపన్యాసంలో వీరగోని పెంటయ్య మాట్లాడుతూ వేలకోట్ల సంవత్సరాల ప్రతి చర్యల ఫలితంగా భూగోళం ఏర్పడిందని, దీనిని పరిరక్షించుకోవడంతోనే మానవ ప్రగతి నాగరికతలు ఆధారపడి ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో మాట్లాడిన వక్తలు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయ అండతో పర్యావరణానికి పాతర వేస్తూ చట్టాలను తుంగలో తొక్కి అధికారుల అండతో కోట్లు కొల్లగొట్టి రానున్న తరాలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్న వైనాన్ని ఎండగట్టారు. మానేరు నదిలో ఇసుక మాఫియా సాగిస్తున్న కుట్రలను, దోపిడీని పరిరక్షణ సమితి నాయకులు సంధి సురేందర్ , చిట్కేసి సతీష్ లు వివరించారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఉత్తర్వులను సైతం లెక్కచేయకుండా ఇసుక మాఫియా సాగిస్తున్న అరాచకాలను వివరించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వివిధ సంఘాల ప్రతినిధులు ఉద్యమకారులు తాము ఎదుర్కొంటున్న కష్టనష్టాలను ఏకరు పెట్టారు. ప్రభుత్వం చట్టాలను తుంగలో తొక్కి పర్యావరణ ఉద్యమకారులపై సాగిస్తున్న దమన నీతిని సంఘటనల సహితంగా వివరించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న సుగుణాకర్ రావు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కొరకు పార్టీలకతీతంగా వివిధ ప్రజాసంఘాలు ఏకమై ఉద్యమించాల్సిన తరుణం ఆసన్న మైందని తెలిపారు. బంగారు తెలంగాణలో ప్రకృతి వనరుల దోపిడీకి అంతులేకుండా పోయిందని ప్రజలు ఉద్యమిస్తేనే దీన్ని నిలిపివేయ గలుగుతామని తెలిపారు. ఇసుక మాఫియా పై పోరాడుతున్న పరిరక్షణ సమితి నాయకులకు తాను అండగా నిలబడతానని అవసరమైన న్యాయ సహాయం చేయగలనని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రజాసంఘాల బాధ్యులు వివిధ అంశాలపై తీర్మానాలు చేశారు.
1. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ఇథనాల్ ప్లాంటుల ఏర్పాటును వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రజల ఆమోదం మరియు అత్యున్నత ప్రమాణాలతో కూడిన వ్యర్థాల నియంత్రణ ఏర్పాట్ల అనంతరం మాత్రమే ఈ ప్లాంట్ల నిర్మాణం విషయమై పునరాలోచించాలని కోరారు.
2. గ్రానైట్ ఎగుమతుల పేరుతో గుట్టల విధ్వంసం సహించరానిదని జీవవైవిద్యం దెబ్బతిని భవిష్యత్ తరాలకు తీవ్ర నష్టం వాటిల్లనున్నందున వెంటనే నిలిపివేసి ఈ అక్రమ వ్యవహారాల్లో కోట్ల కొద్ది నల్లధనాన్ని పోగేసుకున్న ఘరానా వ్యక్తులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మరియు సిబిఐ లు విచారణ జరిపించాలని కోరారు.
3.జాతీయ హరిత ట్రిబ్యునల్ ఉత్తర్వులను గౌరవించి వెంటనే కరీంనగర్ జిల్లాలో మానేరు నదిలో జరుగుతున్న అక్రమ ఇసుక త్రవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణ కొరకు జరుపనున్న ఐక్య పోరాటాలకై ఉద్యమ కార్యాచరణను నిర్దేశిస్తూ ఒక ఉమ్మడి వేదిక నిర్మాణానికై తీర్మానించారు. ఉమ్మడి వేదిక కన్వీనర్ గా మార్వాడి సుదర్శన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకొని దీన్ని విస్తరణ కొరకు కృషి చేయాలని హాజరైన సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు.
రైతు వేదిక నాయకులు ముదిగంటి వెంకటరెడ్డి వందన సమర్పణ చేస్తూ భవిష్యత్తు పోరాటాలకు ఈ సమావేశం నాంది కాగలదని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సర్దార్ సర్వాయి పాపన్న వనరుల పరిరక్షణ సమితి,
తెలంగాణ పౌర హక్కుల సంఘం, లోక్సత్తా ఉద్యమ సంఘం, మానవ హక్కుల వేధిక, తెలంగాణ కవులు రచయితల వేదిక ,సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, సఖి, ప్రగతి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఇథనాల్ ప్యాక్టరీ వ్యతిరేక పోరాట సమితి నాయకులు పాల్గొన్నారు.